టమాట ధర రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. కానీ.. ఓ రైతు మాత్రం ప్రతి ఏటా ఈ సమయంలో టమాట ధర పెరగడం గమనించి.. ఈ సమయానికి పంట చేతికొచ్చేలా ప్లాన్ చేసి మరీ పంట వేశాడు. ఇప్పుడు ధర పెరగడంతో కోట్లు సంపాదిస్తున్నాడు. అతనే మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్ రైతు బాన్స్‌వాడ మహిపాల్ రెడ్డి. అక్షరాలా మూడు కోట్ల రూపాయల విలువైన టమాటా పంట పండించిన మహిపాల్ రెడ్డి దంపతులను సీఎం కేసీఆర్ అభినందించారు. రాష్ట్ర రైతులకు ఆయన ఆదర్శమని అన్నారు.
సమయానుకూలంగా పంటను ఎంచుకోవడంతో పాటు.., వాణిజ్య పంటలను సాగు చేయడంలో వినూత్నంగా ఆలోచిస్తే సేద్యం లాభదాయకంగా ఉంటుందని నిరూపించారని కేసీఆర్ అన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డితో వచ్చిన రైతు మహిపాల్‌రెడ్డి దంపతులు సోమవారం రోజున సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. వారు టమాటా బొకేను కేసీఆర్‌కు అందజేశారు. అనంతరం ఆయన రైతు దంపతులను శాలువాతో సత్కరించారు.