మన దేశంలో సమృద్ధిగా నీటి వనరులు ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. దేశమంతా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయవచ్చని తెలిపారు. దేశంలో కొత్త లక్ష్యాలు.. సంకల్పంతో ముందుకెళ్లాలని వివరించారు. దేశంలో 24 గంటలు విద్యుత్ సరఫరా అందించే వనరులు ఉన్నాయని.. సమృద్ధిగా బొగ్గు నిల్వలు ఉన్నాయని అన్నారు. దేశం మొత్తం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చని.. ఇది అబద్ధమైతే తాను ఒక్క నిమిషం కూడా సీఎం పదవిలో ఉండనని కేసీఆర్ స్పష్టం చేశారు.
సాగు యోగ్యత ఉన్న భూములకు నీరు అందించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కానీ ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలకు ఆ పని చేసే సామర్థ్యం లేవని విమర్శించారు. నిజాయతీగా మేం చేసే పోరాటానికి విజయం తథ్యమని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి నీరు అందిస్తామని చెప్పారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలో ఐదేళ్లలోపు ప్రతి ఇంటికి నీరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నిజాయతీగా పోరాడతామని…అంతిమ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.