సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించిన పాలమూరు బిడ్డ దోనూరి అనన్య రెడ్డి మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో తల్లిదండ్రులతో కలిసి అనన్య ముఖ్యమంత్రిని కలిశారు. సివిల్స్‌లో సత్తా చాటిన పాలమూరు బిడ్డకు శాలువా కప్పిన సీఎం, పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు.
జాతీయ స్థాయిలో అత్యుత్తమ కొలువుల్లో సత్తా చాటిన అనన్య విజయం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. విజయవంతంగా తన సివిల్స్ శిక్షణను పూర్తి చేసి, దేశ సేవకు తోడ్పడాలని ఆకాంక్షించారు. అనన్యను వెనకుండి నడిపించిన తల్లిదండ్రులను రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు అనన్యరెడ్డి కుటుంబ సభ్యులు, పలువురు నేతలు పాల్గొన్నారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2023 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు తమ సత్తా చాటారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించారు. ఆమె తొలి ప్రయత్నంలోనే ఈ ర్యాంకు సాధించడం గమనార్హం.