లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి సత్తా చాటేందుకు అధికార పార్టీ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి జనజాతర సభలు, కార్నర్ మీటింగ్‌లతో ప్రచారంలో జోరు సాగిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ చరిత్రహీనుడిగా మిగిలిపోతున్నారంటూ కేసీఆర్పై విమర్శలు గుప్పిస్తూ.. రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ బీజేపీపై మండిపడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో సమాధానం చెప్పాకే బీజేపీ అభ్యర్థులు ప్రజలను ఓట్లు అడగాలని అన్నారు.
మొత్తానికి ప్రచారంలో దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ తమ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుందంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ కూడా రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈరోజు సాయంత్రం ఆర్మూర్, నిజామాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఉండనుంది. సాయంత్రం 5 గంటలకు ఆర్మూర్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు నిజామాబాద్ రోడ్ షో, కార్నర్ మీటింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు.