ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు రమ్మని ఆహ్వానిస్తే రానంటున్న కేసీఆర్ అసెంబ్లీకి వస్తానంటే నమ్మేదెవరు? అని అని రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం తన నివాసంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా.. కేసీఆర్ ఓ కమర్షియల్ వ్యాపారి అని తెలంగాణను వ్యాపార వస్తువులా మార్చి గత పదేళ్లపాటు లాభాలు పొందారని, ఇంకా లాభాలు పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఒకరోజు ముందుగానే గన్‌పార్క్‌కు వెళ్లడానికి ఆయన ఎన్నికల కమిషన్(ఈసీ) అనుమతి తీసుకున్నారా? అయినా ఒకరోజు ముందుగా అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లడం ఎందుకు? అని రేవంత్ ప్రశ్నించారు. అవతరణ వేడుకలంటే కేసీఆర్‌కు ఇష్టం, గౌరవం లేకనే తమ ఆహ్వానాన్ని మన్నించి రావడం లేదని విమర్శించారు. ఇలా హాజరుకాని ప్రధాన ప్రతిపక్ష నాయకుడెవరైనా ఉంటారా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.