ప్రధాని నరేంద్ర మోదీ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని ఎదుట అనేక సమస్యలను రేవంత్ రెడ్డి నివేదించారు. విభజన తర్వాత పదేళ్లు రాష్ట్రం అప్పులపాలయిందని, గాడిన పడటానికి సహకరించాలని కోరారు.
పెండింగ్ ప్రాజెక్టులను కూడా సత్వరం పూర్తయ్యేలా సహకరించాలని ఆయన కోరారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని కూడా రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిసింది. దీంతో పాటు తెలంగాణకు విభజన సమయంలో రావాల్సిన ప్రయోజనాలను కూడా అందించాలని ఆయన కోరినట్లు తెలిసింది. ఇవాళ ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అంతకు ముందు కూడా జేపీ నడ్డా, నితిన్ గడ్కారీ తదితర కేంద్ర మంత్రులను కలిసారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.