తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రేపు ఆదివారం తన సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ కు వెళ్లనున్నట్టు వ్యక్తిగత సహాయకుడు సైదులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతీ ఏడాది దసరా పండుగ రోజు సొంతూరు కొండారెడ్డి పల్లి, ఆ తరువాత రోజు కొడంగల్ కి వెళ్లడం రేవంత్ రెడ్డికి ఆనవాయితీ. అదే ఆనవాయితీ సీఎం హోదాలో తొలిసారిగా కొనసాగిస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజలను, కార్తకర్తలను కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి కలువనున్నారు.
ఇవాళ తన స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం, కొండారెడ్డి పల్లిలో పర్యటించారు. గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం, గ్రంథాలయం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, బీసీ కమ్యూనిటీ భవనం, రోడ్డు విద్యుత్ లైన్లు, చిల్ట్రన్ పార్కు, వ్యాయామ శాల వంటి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోట మైసమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద కొండారెడ్డి పల్లిలో ఇంటింటికి సోలార్ విద్యుత్ కేటాయిస్తున్న విషయం తెలిసిందే.