రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబాబాద్ ప్రాంతాల్లో భారీ వరదలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. అంతకుముందు మార్గంమధ్యలో సూర్యాపేట జిల్లాలోని పలుప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. అనంతరం ఖమ్మం చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. రాత్రి ఖమ్మం కలెక్టరేట్లో వరదలపై సమీక్ష నిర్వహించిన సీఎం.. రాత్రి అక్కడే బస చేశారు.
మంగళవారం ఉదయం ఖమ్మం నుంచి వరంగల్, మహబూబాబాద్‌లోని ముంపు ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అదేవిధంగా వరదల్లో కొట్టుకుపోయిన మోతీలాల్, ఆయన కూతురు వ్యవసాయ సైంటిస్టు అశ్విని కుటుంబాలను సీఎం పరామర్శించనున్నారు. అనంతరం పురుషోత్తమాయగూడెంకు వెళ్లి ఆకేరు వాగు వరద ఉధృతికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని సందర్శించనున్నారు. అనంతరం మహబూబాబాద్ కలెక్టరేట్‌లో అధికారులతో వరదలు, సహాయకచర్యలపై రివ్యూ నిర్వహించనున్నారు.