ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు ఉదయం దిల్లీ వెళ్లనున్నారు. సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు ఆయన దిల్లీలోనే ఉండనున్నారు. లోక్‌సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు సీఎం వెళ్తున్నారు. మరోవైపు ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన దిల్లీలోనే ఉండి.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరపనున్నట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణ జులై మొదటి వారంలో ఉండవచ్చని పార్టీ నేతలు చెబుతున్న విషం తెలిసిందే.
మరోవైపు కొందరు ఆశావహులు దిల్లీలో పార్టీ నేతల ద్వారా పైరవీలు చేయిస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి పదవీ కాలం ఈ నెల 27వ తేదీతో పూర్తవుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపైనా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీలతో ఆయన చర్చించవచ్చని అంచనా. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేతలంతా బిజీగా ఉంటారని, రాష్ట్రంలో పదవుల భర్తీపై ఎంతవరకు నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రశ్నార్థకమేనని సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు.