18వ లోక్‌సభ సమావేశాలు ఈరోజు (జూన్ 24వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. జులై 3వ తేదీ వరకు కొనసాగే ఈ సమావేశాల్లో- నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణం, నూతన స్పీకర్ ఎంపిక, ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం, తర్వాత ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉండనున్నాయి. అయితే లోక్‌సభ స్పీకర్ ఎవరవుతారనే ఉత్కంఠ నెలకొంది. తాజా రాజకీయ వాతావరణాన్ని బట్టి ఓం బిర్లానే మరోసారి కొనసాగించనున్నట్లు సమాచారం.
మరోవైపు లోక్‌సభలో గంటకు 26 మంది ఎంపీలు ప్రమాణం చేసేలా షెడ్యూల్ ఖరారు చేశారు. తొలిరోజు 280 మందికి, మలిరోజు మిగిలిన సభ్యులు ప్రమాణం చేయనున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమం జరగనుంది. ఇవాళ ఉదయం ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి చేత రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించనున్నారు. తర్వాత ఆయన లోక్‌సభకు చేరుకొని ఉదయం 11 గంటలకు సభా కార్యకలాపాలు ప్రారంభిస్తారు. తొలి రెండురోజులు సభ్యుల ప్రమాణాలు పూర్తయిన తర్వాత స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది.