మోదీ, కేసీఆర్.. మెదక్ ప్రాంతాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పిట్టలదొరలా మారారని.. ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక్కడ కాపలా ఉన్నది.. రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌పై చెయ్యి వేస్తే మాడి మసైపోతారు.. నేను జైపాల్‌రెడ్డి, జానారెడ్డిని కాదని తెలుసుకో.. రోడ్డుపై పరుగులు పెట్టిస్తా.. జాగ్రత్త.. అంటూ కేసీఆర్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీలో రేవంత్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పథకాలు చూసి కేసీఆర్ కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని అన్నారు.
‘మహిళల కష్టాలు చూడలేక సిలిండర్లు, స్టవ్‌లను ఇచ్చి కాంగ్రెస్ ఆదుకుంది. పేదవాడి కళ్లలో ఆనందం చూసి ఓర్వలేకపోతున్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తే బీఆర్ఎస్ నేతలకు ఏం బాధ? 200 యూనిట్ల కంటే తక్కువ వచ్చిన ఇళ్లకు జీరో బిల్లులు ఇస్తున్నాం. మెదక్ జిల్లాలో ఎన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలి? పేదలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఇళ్లు కట్టిస్తాం. ఏడుపాయల దుర్గమ్మ, మెదక్ చర్చి సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేసి తీరతాం.. నాదీ మాట. రైతుల రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా. వచ్చే వరిపంటకు రూ.500 బోనస్ ఇచ్చి కొంటాం. పదేళ్లు ఇక్కడే ఉంటాం.. ఎవరు వస్తారో రండి.. చూసుకుందాం.’ అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.