రాష్ట్రంలో బీఆర్ఎస్ చాలా బలహీనంగా ఉంది.. ప్రస్తుతం మన ఫోకస్ అంతా బీజేపీని ఓడించడంపైనే పెట్టాలి అని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. ఉత్తరాదిలో బీజేపీ గత పక్షం రోజులుగా బలహీనపడిందని, అందుకే దక్షిణ భారతంపై దృష్టి పెట్టిందని తెలిపారు. ఇక్కడా అవకాశం ఇవ్వవద్దని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలవడం పార్టీకి అత్యంత కీలకమని, 15 చోట్ల విజయం సాధించాలన్న లక్ష్యంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల వ్యూహంపై లోక్‌సభ స్థానాల ఇన్‌ఛార్జులు, అభ్యర్థులతో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారంపై నేతలకు అధిష్ఠానం తరపున వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందువల్ల ఇప్పుడూ గెలుస్తామనే భ్రమపడవద్దని చెప్పారు. కష్టపడి పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడిందని.. ఆ పార్టీపై ఎక్కువ దృష్టి పెట్టవద్దని, బీజేపీపైనే పోరాడాలని సూచించారు.