కేసీఆర్ ను ఈఎంఐ లు చెల్లించమంటున్న జగ్గారెడ్డి… ఇంకా ఉన్నాయి!

-

కొంతమంది ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం పై చేసే విమర్శలు, ఇచ్చే సూచనలు, అడిగే డిమాండులు చాలా డిఫరెంటుగా ఉంటాయి… వాటిపై ఎలా స్పందించాలో ఒక్కోసారి ఎవరికీ అర్ధం కాదు! ఆ డిమాండ్ లపై అడిగినవారికి మాత్రం ఎంత క్లారిటీ ఉందనే విషయం సంగతి కాసేపు పక్కన పెడితే… కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అర్ధం చేసుకుని… వారి ఇంటి అద్దెలు, ఈఎంఐ లూ ప్రభుత్వమే కట్టాలని.. అలా కానిపక్షంలో దీక్ష చేస్తానని చెబుతున్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి!

అవును… కరోనా వల్ల లాక్ డౌన్ కొనసాగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారి ఇబ్బందులను అర్ధం చేసుకుని, ఆరు నెలల కిరాయితో పాటు వారికున్న బ్యాంక్ ఈఎంఐ లను కూడా ప్రభుత్వమే భరించాలని డిమాడ్ చేస్తూ సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ రాశారు. ఈ లేఖపై ఈ నెల 8వ తేదీలోపు కేసీఆర్ స్పందించని పక్షంలో… 9వ తేదీన దీక్ష చేస్తానని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయిందిరా నాయనా, ఖజానా ఖాళీ అవుతుందిరా బాబు అని కేసీఆర్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నట్లుగా చెబుతున్న జగ్గారెడ్డి.. కొన్ని లాజిక్కులు కూడా లాగారు!

ప్రభుత్వం వద్ద నిజంగా డబ్బులు లేకపోతే… లాక్ డౌన్ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.25 వేల కోట్లు ఎలా కేటాయించారు? అని ప్రశ్నించిన ఆయన… కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 2 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్.. ప్రజల కోసం మరో లక్ష కోట్లు అప్పుచేయలేరా? ప్రాజెక్టులకు నగదు కేటాయిస్తారు.. కానీ ప్రజల ప్రయోజనాలు పట్టవా? అంటూ ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. ఈ సమయంలో సలహా కూడా ఇచ్చే ప్రయత్నం చేసిన జగ్గారెడ్డి… అప్పు చేయడం సాధ్యంకాని పక్షంలో.. కేంద్ర ప్రభుత్వాన్ని అయినా సాయం అడగాలని సూచిస్తున్నారు.

ఈ సమయంలో మరింత క్లారిటిగా తమ డిమాండులను తెలిపిన జగ్గారెడ్డి… గ్రామాలతోపాటు పట్టణాల్లో సైతం ఇంటిపన్నును ఏడాది పాటు మాఫీ చేయాలని.. ఇదే క్రమంలో విద్యుత్ చార్జీ కూడా రద్దు చేయాలని, నీటి బిల్లులను రద్దు చేయాలని, కంపెనీల కరంట్ బిల్లు కూడా మాఫీ చేయాలని.. హైదరాబాద్‌ లో రూ.30 వేల లోపు, ఇతరచోట్ల 15వేల లోపు ఇంటి అద్దెను ప్రభుత్వమే కనీసం 6 నెలలు చెల్లించాలని.. వాటితోపాటు వారి ఈఎంఐ లనుకూడా ఆరు నెలలపాటు ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. ఈ మాఫీ డిమాండులపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Latest news