రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. అయితే పలు స్థానాలకు ఇతర పార్టీలోని నేతలను చేర్చుకుని వారికి టికెట్ ఇచ్చింది. స్థానికంగా ఆయా నేతలు బలంగా ఉండటంతో వారిని పార్టీలోకి ఆహ్వానించి టికెట్ కేటాయించింది.
మరోవైపు ప్రచారంలోనూ కాంగ్రెస్ పార్టీ జోష్ పెంచింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో గ్యారంటీలు ప్రకటించిన మాదిరి.. లోక్సభలోనూ సమర్థమైన మేనిఫెస్టోతో ప్రజలను ఆకర్షించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో ప్రకటనకు హైదరాబాద్ తుక్కుగూడ సభ వేదికగా కానుంది. వచ్చే నెల 6వ తేదీన నిర్వహించే జన జాతర సభకు భారీగా జనసమీకరణ చేయాలని పీసీసీ నిర్ణయించింది. భారాసకు రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాపాలనను రోల్ మోడల్‌గా భావిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. ఇక్కడి నుంచే ఐదు న్యాయ్ గ్యారంటీలను వెల్లడించాలని నిర్ణయించింది.