తెలంగాణలో ఈనెల 21 నుంచి గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే గ్రూపు 1 పరీక్షలను రద్దు చేయాలని కొందరూ అభ్యర్థులు ఆందోళన చేపట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ నగరంలో కొంత మంది అభ్యర్థులను పోలీసులు అరెస్టులు చేయడం గమనార్హం. మరోవైపు ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ః
తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ చీఫ్ జస్టిస్ కోర్టులో స్పెషల్ మోషన్ దాఖలు చేశారు. అభ్యర్థుల తరఫున అడ్వకేట్ మోహిత్‌రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు సోమవారం విచారణ జరుపుతామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు. మొదటి కేసుగా ఉదయం 10.30 గంటలకు విచారించనున్నారు. కాగా, అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు గ్రూప్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తాజాగా మాజీ ఐఏఎస్, బీఆర్ఎస్ నేత ఆర్.ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఓపెన్ కాంపిటీషన్ లేదా అన్ రిజర్వుడ్ కేటగిరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్లూఎస్ లకు ప్రవేశం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా జీవో నెం.29ను తీసుకొచ్చిందని.. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు మాత్రం ఏం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ” మీకు ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా సీఎంను నిలదీయండి. ఒకే వర్గానికి కొమ్ము కాస్తున్న TGPSC బోర్డును రీకాల్ చేయించండి” అంటూ ట్వీట్ చేశారు.