కాంగ్రెస్ పాలన రైతుల పట్ల శాపంగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రైతు సురేంధర్ రెడ్డి మరణానికి ప్రధాన కారణం రుణమాఫీ కాకపోవడమేనని తెలిపారు. సురేందర్ రెడ్డిది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య అన్నారు. అందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పారు. కానీ కొంత మందికి మాత్రమే రుణమాఫీ చేశారు. రుణమాఫీ కానీ రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు 475 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రుణమాఫీ ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 31 సాకులు చెబుతోందని పేర్కొన్నారు హరీశ్ రావు. కొంత బాధ, కొంత దు:ఖంతో మాట్లాడుతున్నానని చెప్పారు. రైతు సురేందర్ రెడ్డి తల్లికి రుణమాఫీ అయింది. అందుకే సురేందర్ రెడ్డికి కాలేదన్నారు. కుటుంబాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లీ కొడుకు మధ్య చిచ్చు పెట్టాడని పేర్కొన్నారు. గతంలో పాస్ బుక్ ఉంటే.. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదన్నారు. 21లక్షల మందికి రుణమాఫీ కాలేదని.. ఇది నేను చెబుతున్న మాట కాదు.. వ్యవసాయ శాఖ మంత్రి గారే చెప్పారని గుర్తు చేశారు హరీశ్ రావు.