కాంగ్రెస్ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. మానవ హక్కులను పునరుద్ధరించి.. ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరభ్యరంతంగా వారి అభిప్రాయాలను తెలియజెప్పి.. చట్ట సభలలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద.. వాదనలకు కాంగ్రెస్ అవకాశం ఇస్తుంది. కాంగ్రెస్ గెలుపును మంత్రి కేటీఆర్ అభినందించారు. వారిని అభినందిస్తున్నాను. ప్రతిపక్షాలు అందరూ పాల్గొని గెలిచిన పార్టీలే కాకుండా.. అన్ని పార్టీలకు ఆహ్వానం పలుకుతాం అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల హక్కులను కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు.. రాహుల్ గాంధీ చట్టభద్దత కల్పిస్తామన్నారో వాటిని అమలు చేస్తాం. సీపీఐ, సీపీఐ(ఎం), జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఆలోచనలను తీసుకొని ముందుకు వెళ్తాం అని తెలిపారు రేవంత్ రెడ్డి. ప్రజల ఆదేశాన్ని ఒక సందేశాన్ని వారు ఇచ్చిన తీర్పును శిరస్సా వహించి.. ప్రజలు కన్న కలలను అమలు చేయడానికి అన్ని రకాల సహకారాలుండాలని కాంగ్రెస్ ఆశిస్తోంది.
గతంలో చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో.. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండటానికి ఒక ఆదర్శవంతమైన పాలనను అందించేందుకు కృషి చేయాలన్నారు. సామాన్యులకు పరిపాలనను అందుబాటులోకి తీసుకురావడం కోసమే సచివాలయం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ప్రగతి భవన్ ను బాబా సాహెబ్ అంబేద్కర్ భవన్ గా మార్చతామని తెలిపారు.