కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి.. ఎన్నికల హామీలు అమలు చేయిస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఊపు తగ్గింది. అరచేతిలో వైకుంఠం చూపించి హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి మరీ మోసం చేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, ఇప్పడు ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకుంటున్నారు. వంద రోజుల తర్వాతే కోడ్ వచ్చింది. రూ. 2 లక్షల రుణమాఫీ, వడ్లకు, మక్కలకు రూ. 500 బోనస్, రూ. 4 వేల ఫించన్, రైతుబంధు రూ.15 వేలు, మహిళలకు రూ. 2500, కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం, రూ. 4 వేల నిరుద్యోగ భృతి, ఆడపిల్లలకు ఉచిత స్కూటీ అందినవాళ్లే కాంగ్రెస్‌కు ఓటేయండి, అందనివాళ్లు బీఆర్ఎస్‌కు ఓటేయండి అని హరీశ్‌రావు సూచించారు.