ఎస్సీ వర్గీకరణ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 341 కి వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ జడ్జీమెంట్ పైనే మా మాలల పోరాటమని స్పష్టం చేసారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తలపెట్టిన మాలల సింహ గర్జన సభలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లు లేకుండా చేయాలనే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. షెడ్యూల్ కులాలను ఆదుకోవాలని అంబేద్కర్ రిజర్వేషన్లు తెచ్చారని ఆ రిజర్వేషన్ ఫలాల వల్లనే సమాజంలో ఎస్సీలు కొంత ముందుకు వచ్చారని పేర్కొన్నారు.
సమాజంలో కుల వ్యవస్థ మనల్నీ ఇంకా వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. అంబేద్కర్ ఇచ్చిన హక్కులను తూచా తప్పకుండా పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సెక్టార్ లోనే కాకుండా ప్రైవేట్ సెక్టార్ లో రిజర్వేషన్లు ఉండాలన్నారు. మాల, మాదిగ కులాల మధ్య విభేదాలు రాకుండా ఉండాలనే ఈ సభ నిర్వహించామని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా ఉండాలని.. ఎస్సీల హక్కుల కోసం మాల మాదిగ సంయుక్త పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.