గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో చేయూత పేరుతో వృద్ధులను మోసం చేసిందని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. చేయూత పేరుతో 4000 రూపాయలు నెలవారి ఫింఛను ఇస్తామని ఇచ్చిన హమీ ఎటు పోయిందని ఆయన ప్రశ్నించారు. నాలుగు వేలు కాదు 2016 లు సక్రమంగా ఇవ్వకుండా కాంగ్రెస్ పాలకులు సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేశారని విజయోత్సవాలు చేసుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఆరు గ్యారెంటీల్లో మహిళలను, రైతులను, నిరుపేదలను మోసం చేసినట్లే వృద్ధులను దగా చేశారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
మానీఫెస్టో కమిటి చైర్మన్‌గా 420హమీలకు రూపకల్పన చేశామని గొప్పలు చెప్పుకునే మంథని ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఏ ఒక్క పథకం అమలు చేయలేదని అన్నారు. పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందుకేనా విజయోత్సవ సంబరాలు నిర్వహించుకుంటున్నారని పుట్ట మధు విమర్శించారు. ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, రౌడీలుగా చిత్రీకరించడం అలవాటుగా మారిందని, అలాంటి కేసులకు భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై కాంగ్రెస్ ప్రజావంచన దినాలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు పుట్ట మధుకర్.