తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయమైన పరిపాలన సాగిస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి, వసూల్లు విచ్ఛలవిడిగా జరుగుతున్నాయని.. అదే సమయంలో అడ్మినిస్ట్రేషన్ మాత్రం సరిగ్గా కొనసాగడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణలోని కొన్ని అంశాలు అవినీతిమయమయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టులు, కమీషన్ల దందా సాగుతుందని విమర్శించారు.
జీవోలను కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదన్నారు. కేవలం ఢిల్లీకి వందల కోట్లు చెల్లించేందుకు వసూళ్లు చేయడమే తప్పా ప్రజలకు ఇచ్చిన హామీలపై ధ్యాస లేదన్నారు. రూ.1150 కోట్ల సివిల్ సప్లయ్ కుంభకోణంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా.. అక్రమాలకు పాల్పడిన మిల్లర్ల నుంచి రికవరీ చేయకుండా మళ్లీ ధాన్యం అప్పగిస్తున్నారన్నారు. దీని వెనుక చీకటి ఒప్పందం ఏమిటనీ నిలదీశారు. సీఎంకు, సివిల్ సప్లయ్ మంత్రుల ప్రమేయం ఏమిటి..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలకులు మిల్లర్ల నుంచి భారీ ఎత్తున ముడుపులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.