కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం స్వామి వారిని అరటి పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు.
అనంతరం స్థాపితా దేవారాధన, హోమం, సుందరకాండ పారాయణం, పంచామృత అభిషేకం, సహస్ర నామార్చన, మహా నివేదన, మంత్రపుష్పం అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు. మాలధారణ భక్తులు వారిని దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలిరావడంతో కొండగట్టు కాషాయమయం అయింది. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు, మాలధారులు పెద్ద ఎత్తున అంజన్న కొండకు చేరుకుంటున్నారు. ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.