అటవీశాఖ, క్షేత్రస్థాయి సిబ్బంది సమస్యలపై డీజీపీ టెలీ కాన్ఫరెన్స్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎఫ్​ఆర్​ఓ శ్రీనివాస రావు హత్య జరిగిన నేపథ్యంలో అప్రమత్తమైన డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అటవీ అధికారులు, సిబ్బంది చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని.. వారందరికి పోలీసులు మద్దతుగా నిలవాలని సూచించారు. అటవీ సిబ్బందికి తమ శాఖ తరఫున భరోసా కల్పించాలని ఆదేశించారు.

భద్రాద్రి కొత్తగూడెంలో క్షేత్రాధికారి శ్రీనివాసరావు హత్య, అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియల్ విజ్ఞప్తి నేపథ్యంలో అటవీ, పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీసీసీఎఫ్ డోబ్రియల్ కూడా కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. క్షేత్రస్థాయి అటవీ అధికారులు, సిబ్బందికి మద్ధతుగా నిలిచి భరోసా కల్పించాలని.. భద్రాద్రి కొత్తగూడెం లాంటి సంఘటలను పునరావృతం కాకుండా చూడాలని డీజీపీ పోలీసు అధికారులకు సూచించారు. తమ పరిధిలోని చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులతో స్వయంగా సమావేశం కావాలని పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలను ఆదేశించారు.

అటవీ అధికారులు, సిబ్బంది సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని పోలీసులకు డీజీపీ చెప్పారు. అదే తరహాలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు కూడా తమ పరిధిలోని అటవీ అధికారులతో సమావేశం కావాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ అధికారులకు సూచించారు.