తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడప్పుడు పలు వింత వింత పుకార్లు వ్యాప్తి అవుతుంటాయి. ఆడపడుచులకు గాజులు పెట్టించాలి.. ఒక్కడే మగ పిల్లాడు ఉన్న తల్లి వేప చెట్టుకు నీళ్లు పోయాలని.. ఊరంతా కలిసి వనభోజనాలు చేయాలి. బంధువులకు బట్టలు పెట్టాలి అంటూ వింత వింత పుకార్లు వెలుగులోకి వస్తుంటాయి. ఇలాంటి మూఢనమ్మకాలను జనాలు కూడా నమ్మి గుడ్డిగా చేసేస్తుంటారు.
తాజాగా.. కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. కొబ్బరి కాయల వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి వ్యాపారం బాగా జరగాలని వినూత్న ప్రయత్నం చేశాడు. ”మా దుకాణంలో కొబ్బరి కాయలు కొని దేవుడికి కొట్టినచో మంచి జ్ఞానం, ధైర్యం, ధనం, బలం, తేజస్సు, ఆరోగ్యం, సహనం లభించును” అని వ్యాపారి దేవుసాని పాపయ్య కరీంనగర్ జిల్లాలోని ప్రకాశం గంజ్లో వాల్ రైటింగ్స్ రాయించాడు. దీనిని చూసిన ఓ వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. దీనిని చూసిన వారంతా మాకు జ్ఞానం కావాలి, మాకు ధనం కావాలి, మాకు ధైర్యం కావాలి అని సరదాగా కామెంట్లు పెడుతున్నారు.