పది రోజుల్లో ధరణీ దరఖాస్తులు పరిష్కరించాలి.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఆయన తెలంగాణ చీఫ్ సెక్రెటరీ శాంతి కుమార్, అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ధరణి సమస్యలపై గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులతో పాటు.. ఇటీవల కాలంలో కొత్తగా వచ్చిన దరఖాస్తులను రాబోయే పది రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఒకవేళ తిరస్కరించిన దరఖాస్తులకు సరైన కారణాలను తెలియజేయాలని సూచించారు. ముఖ్యంగా రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో దరఖాస్తులు పెండింగ్ అధికంగా ఉన్నాయని.. ఈ జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ని ఆదేశించారు. లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే లేఅవుట్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం.. మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పకడ్బంధీగా చర్యలు తీసుకోవాలి. ఎస్ఆర్ఎస్ క్షేత్రస్థాయి తనిఖీల కోసం స్పెషల్ టీమ్ లతో పాటు హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేసుకోవాలి.