వందేభారత్ రైలులో టికెట్లు తనిఖీ చేసే టీటీఈ సిబ్బంది నియామకం రెండు జోన్ల మధ్య జగడంగా మారుతోంది. ఉదయం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వచ్చే ఈ రైలులో తూర్పు కోస్తా జోన్ నుంచి నలుగురు టీటీఈలు టికెట్ తనిఖీ విధుల్లో ఉంటున్నారు. మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే రైలులో ద.మ.రైల్వే టీటీఈలు విధుల్లోకి వస్తున్నారు. టీటీఈలకు కేటాయించిన సీట్లలో వారు కూర్చుంటున్నారు. ఆ సమయంలో తూర్పు కోస్తా టీటీఈలు.. రైల్లో ఎక్కడైనా సీట్లు దొరికితే కూర్చుంటున్నారు. లేదంటే తలుపుల దగ్గర కూర్చుంటున్నారు.
రాత్రికి విశాఖపట్నం చేరుకున్నాక ద.మ.రైల్వే టీటీఈలు అక్కడే నిద్రించి తెల్లవారుజామున అదే రైల్లో ఇలానే ఇబ్బందులు పడుతూ సికింద్రాబాద్ వస్తున్నారు. ఇలా ఒక రైలులో రెట్టింపు సంఖ్యలో సిబ్బంది ఉండడంతో మానవ వనరులు సైతం వృథా అవుతున్నాయి.
ఈ క్రమంలో.. సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ నుంచి ద.మ.రైల్వే టికెట్ తనిఖీ సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని తూర్పుకోస్తా జోన్ బుధవారం లేఖ రాసింది. ఈ రైలు నిర్వహణను తూర్పుకోస్తా జోన్ పరిధిలోకి వచ్చే విశాఖపట్నంలో చేపడుతున్న విషయాన్ని ప్రస్తావించింది. రెండు వైపులా తమ సిబ్బందే విధులు నిర్వహిస్తారని జోన్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఆ లేఖలో పేర్కొన్నారు.