తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి వరుసగా ఐదు రోజుల పాటు ఎంసెట్ పరీక్ష జరగనుంది. మొదటి రెండ్రోజులు అనగా 10, 11వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా విభాగం, తర్వాతి మూడు రోజులు(12, 13, 14వ తేదీల్లో) ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9-12 గంటల మధ్య తొలివిడత, మధ్యాహ్నం 3-6 గంటల మధ్య మలివిడత నిర్వహిస్తారు. మొత్తం 3,20,292 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అగ్రికల్చర్‌కు 1,14,952 మంది, ఇంజినీరింగ్‌కు 2,04,968 మంది ఉన్నారు.
ఉదయం విడత పరీక్ష రాసే విద్యార్థులను 7.30 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్షలు రాసేవారిని 1.30 గంటల నుంచి లోపలికి రానిస్తారని ఎంసెట్ కన్వీనర్ డీన్‌కుమార్, కో కన్వీనర్ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో 104, ఏపీలో 33 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. దరఖాస్తు చేసిన అభ్యర్థే పరీక్ష రాస్తున్నాడని తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఫొటో గుర్తింపుపత్రం తీసుకెళ్లాలని సూచించారు. కళాశాల ఐడీ, ఆధార్, పాన్, ఓటర్ గుర్తింపు కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టులలో ఏదో ఒకటి తప్పనిసరని చెప్పారు.