హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు అవతలి నుంచి నిర్మించే రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగాన్ని కేంద్ర సర్కార్ ‘భారత్‌మాల-2’ ప్రాజెక్టులో చేర్చింది. ఏడాదిన్నర క్రితం నుంచి ఈ ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉండగా.. ఇటీవల జరిగిన సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసింది. పూర్తిస్థాయి సవివర నివేదిక(డీపీఆర్)కు కూడా అధికారులు తుది కసరత్తు పూర్తి చేశారు.
కేంద్రం ఆర్‌ఆర్‌ఆర్‌ను 347.80 కిలోమీటర్ల మేర ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ రెండు భాగాలను రూ.22 వేల కోట్లతో పూర్తిచేయాలని తొలుత అధికారులు అంచనా వేశారు. తాజా అంచనాల ప్రకారం రెండు భాగాలకు కలిపి రూ.25 వేల కోట్ల నుంచి రూ. 26 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని భావిస్తున్నారు. చౌటుప్పల్, ఆమనగల్లు, షాద్‌నగర్, చేవెళ్ల, సంగారెడ్డి వరకు 189.20 కిలోమీటర్ల మేర దక్షిణ భాగం ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. దీని నిర్మాణానికి రూ.13 వేల కోట్ల నుంచి రూ. 14.5 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా.