తెలంగాణ వైద్య కళాశాలల్లో రెండో రోజు ఈడీ సోదాలు

-

తెలంగాణలో ఈడీ దాడులు మరోసారి కలకలం రేపాయి. బుధవారం రోజున రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. ఇవాళ రెండో రోజు కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో మల్లారెడ్డి, కామినేని , మెడిసిటీ , ప్రతిమ సంస్థ కార్పొరేట్‌ కార్యాలయం, కరీంనగర్‌లోని ప్రతిమ, మహబూబ్‌నగర్‌లోని SVS, నల్గొండలోని కామినేని, ఖమ్మంలోని మమత, రంగారెడ్డిలోని పట్నం మహేందర్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, సంగారెడ్డిలోని MNR వైద్య కళాశాలల్లో ఈ సోదాలు జరిగాయి.

ప్రైవేటు వైద్య కళాశాలల నిర్వాహకులు పీజీ సీట్లను ప్రణాళిక ప్రకారం బ్లాక్‌ చేసి.. భారీ మొత్తానికి విక్రయించారంటూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు.. గతేడాది ఏప్రిల్‌లో వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మట్టేవాడ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే తాజాగా ఈడీ రంగంలోకి దిగింది. సీట్లు అమ్ముకున్న సొమ్ముతో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు ఆరంభించింది. వందల కోట్లు చేతులు మారి ఉంటాయని అనుమానిస్తున్న ఈడీ.. ఆ సొమ్మును ఎక్కడికి మళ్లించారనే విషయంపై కూపీ లాగుతోంది. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు.. కొందరు మెరిట్‌ విద్యార్థులు, దళారులతో కుమ్మక్కై… పీజీ సీట్ల బ్లాకింగ్‌ దందాకు పాల్పడ్డాయనేది ప్రధాన ఆరోపణ.

Read more RELATED
Recommended to you

Latest news