బ్యాంక్ లావాదేవీలపై ఈసీ నిఘా.. రూ.లక్షకు మించి విత్‌డ్రా చేసినా, డిపాజిట్‌ చేసినా ఆరా

-

దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఈ ఎన్నికల్లో నగదు, మద్యం విచ్చలవిడిగా చేతులు మారకుండా జాగ్రత్తపడుతోంది. ఈ నేపథ్యంలోనే బ్యాంకు లావాదేవీలపైనా నిఘా పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. బ్యాంకు ఖాతాల నుంచి రూ.లక్షకు మించి విత్‌డ్రా, డిపాజిట్‌ చేసినా అందుకు సంబంధించిన వివరాలను ఆరా తీయాలని ఆదేశించింది.

ఎన్నికలపై డబ్బు ప్రభావాన్ని కట్టడి చేసేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేసిన ఈసీ దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా లేఖ రాసింది. రూ.లక్ష అంతకుమించి నిర్వహించే లావాదేవీల వివరాలను అన్ని బ్యాంకుల నుంచి జిల్లా ఎన్నికల అధికారులు తెప్పించుకోవాలని సూచించింది. వాటిని విశ్లేషించే బాధ్యతను సంబంధిత సిబ్బందికి అప్పగించాలని పేర్కొంది. ఎన్నికల సమయంలో ఒకే బ్యాంకు బ్రాంచి నుంచి వేర్వేరు ఖాతాలకు సొమ్మును బదిలీ చేస్తున్న దాఖలాలపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపింది. రూ.10 లక్షలకు మించిన నగదు ఉపసంహరణ లేదా డిపాజిట్లపైనా నిఘా పెట్టాలని, ఆయా వివరాలను ఆదాయ పన్నుశాఖ నోడల్‌ అధికారులకు అందచేయాలని సీఈసీ స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news