గ్రూప్ 1 రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీపై హైకోర్టు తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు: ఈటల రాజేందర్

-

 తెలంగాణ హైకోర్టు ఈ రోజు గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ ఆదేశాలు వెలువరించిన సంగతి తెలిసిందే. జూన్ 11న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓంఎంఆర్ షీట్లు ఇచ్చారని కొందరు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లు విచారించి అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడమే ప్రధాన కారణంగా పేర్కొంటూ గ్రూప్ 1ను రద్దు చేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన ప్రతి నిబంధనను టీఎస్పీఎస్సీ పాటించాలని ఆదేశించింది. ఈ తీర్పును పేర్కొంటూ బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

టీఎస్పీఎస్సీపై హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఈటల రాజేందర్ అన్నారు. నియామకాల కోసమే యువత ప్రధానంగా ఉద్యమించిందని వివరించారు. అలాంటి యువత జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోందని అన్నారు. ఈ ప్రభుత్వం 30 లక్షల మంది నిరుద్యోగులతో ఆటలాడుతోందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఉద్యోగాల కోసమని వివరించారు.

  తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని కేసీఆర్ ప్రకటించాడని, కొత్త ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని నమ్మబలికారని ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ప్రైవేట్‌లోనూ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రలోభ పెట్టారని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలిపారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేస్తే 17 పేపర్లు లీక్ చేసి నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఇకనైనా యువతపై దృష్టి పెట్టి సరైన విధంగా ఉద్యోగ నియామకాలు జరిగేలా చూడాలని వివరించారు. కేసీఆర్ కేవలం ఎన్నికలు, పైసలు పంచుడు, మద్యం పంచుడు మీద కాదు.. ఉద్యోగాల భర్తీ మీద ఫోకస్ ఉండాలని తెలిపారు. కేసీఆర్ ఒరగబెట్టింది ఏమీ లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news