కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ స్కాములే..అందుకే బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు ఈటల రాజేందర్. బోడుప్పల్, వివేకానందనగర్ వాసులతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగులో పాల్గొన్న ఈటల రాజేందర్..అనంతరం మాట్లాడారు. సాధారణంగా మామూలు ఉద్యోగులు ఏమనుకుంటారో నాకు తెలుసు. వారికి రాజకీయాలంటే అంత ఆసక్తి ఉండదు. వారి వృత్తి , వ్యాపారాలలో బిజీగా ఉంటారు. మేము ఎదురు పడినా అంత పట్టించుకోరు. ఓట్లప్పుడు మాత్రం అడగడానికి వస్తారు. సమస్యలు చెప్తే మాత్రం పట్టించుకోరు అని వారు భావిస్తారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది.
మహిళలకు, రైతులకు వరాలు కురిపించింది. కానీ వాటిలో ఎన్ని నెరవేరాయి. మహిళా పాలసీలంటూ ప్రతీ మహిళకూ ఎకౌంటులో రూ. 2500 ఇస్తామన్నారు. ఇంతవరకూ ఒక్కరికి కూడా రాలేదని ఫైర్‌అయ్యారు.ఆడపిల్ల వివాహానికి కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలతో పాటు, తులం బంగారం ఇస్తానని కూడా చెప్పాడు. అది ఒక్కరికి కూడా ఇంకా చేరలేదు. మహిళలకు ఉచిత బస్సు మాత్రం అమలు చేస్తున్నారు. అది కూడా పాత డొక్కు బస్సులతోనే నడిపిస్తున్నారు.
ప్రధాని మోదీ హయాంలో ఇలాంటి పాలసీలు లేవు, ప్రజలు ఓట్లు వేస్తారా, లేదా, నా ప్రధాని పదవి ఉంటుందా లేదా అని ఆలోచించరు.కేవలం దేశాభివృద్ధి కోసం మాత్రమే ఆలోచిస్తారు. దానికోసం కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటారన్నారు. కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేసి వారికి స్వతంత్య్రంగా, ధైర్యంగా జీవించే అవకాశం కల్పించారు. ఒక దేశం, ఒకే చట్టం అన్న నినాదంతో దూసుకుపోతున్నారని వెల్లడించారు. గతంలో కాశ్మీరులో బాంబుల మోతలు హోరెత్తించేవి. హైదరాబాద్‌లో కూడా స్లీపర్ సెల్స్ ఉండేవారు, బాంబు పేలుళ్లు ఉండేవి.
ఇప్పుడు ఇక్కడ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. దేశంలోని ఏ సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన వారైనా మోదీని తమ సొంత మనిషిగా భావిస్తారు. యథా రాజా తథా ప్రజా అన్నట్లు మోదీ సిద్దాంతాలు ప్రజలందరూ వంటబట్టించుకున్నారని వివరించారు.
ప్రధాని మోదీ బ్రతికితే ప్రజల కోసమే, చనిపోతే ప్రజల కోసమే అని ప్రకటించారు. రాజ్యాంగాన్ని మోదీ మార్చేస్తారని అబద్దపు ప్రచారాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి అతి ఎక్కువ సార్లు రాజ్యాంగ సవరణలు చేసింది కాంగ్రెస్ పార్టీనే. అప్పటికప్పుడు అబద్దాలతో ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతోనే వారు ఇలాంటి చెడు ప్రచారాలు చేస్తున్నారన్నారు.