CPI, CPM లు కెసిఆర్ వదిలిన బాణాలా? – ఈటెల రాజేందర్

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల బిజెపి వదిలిన బాణం అని టిఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. షర్మిల బీజేపీ వదిలిన బాణమా? కాదా? పక్కన పెడితే ఆమెది ఒక పార్టీ అని.. అలా అయితే సిపిఐ, సిపిఎం పార్టీలు కేసీఆర్ వదిలిన బాణాల? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు అన్ని పార్టీలు తెలియజేస్తాయని.. షర్మిలపై పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదని మండిపడ్డారు ఈటెల.

ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పని ఎవరు చేసినా ఖండించాల్సిందేనన్నారు. ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఇలా చేస్తే తెలంగాణ ఉద్యమం నడిచేదా అని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు ఈటెల రాజేందర్.