గోడపై సూసైడ్ నోట్ రాసి.. హైదరాబాద్​లో కుటుంబం ఆత్మహత్య

హైదరాబాద్ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేధింపుల కారణంగా ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. కుమార్తెకు ఉరి వేసి మరీ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ముషీరాబాద్‌లోని గంగపుత్రకాలనీలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణాజిల్లాకు చెందిన సాయికృష్ణ, భార్య చిత్రకళ కూతురు తేజస్వితో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వారు గురువారం ఆత్మహత్య పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దీనికి గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు వారి ఇంట్లో ఓ గోడకు రాసిన సూసైడ్ నోట్ కనిపించింది. ఈ లేఖలో ఉన్న వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ బిర్లా ప్లానిటోరియంలో చిత్రకళ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అక్కడ జరుగుతున్న అవినీతితోపాటు  కొందరు వేధింపులకు గురిచేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని గోడపై రాసి ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు వేధింపులకు గురి చేస్తున్న వారి పేర్లు కూడా లేఖలో ఉండటంతో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.