తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి హై కోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 6న మల్లారెడ్డిపై చీటింగ్, అట్రాసిటీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తమకు వారసత్వంగా రావాల్సిన భూమి వచ్చేవిధంగా చేస్తామని మభ్యపెట్టి పీటీ సరెండర్ చేశారని ఆరోపిస్తూ.. కేతావత్ బిక్షపతి అనే వ్యక్తి గత నెల 18న ఇచ్చిన ఫిర్యాదు పై శామీర్ పేట పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి, హరిమోహన్ రెడ్డి, మధుకర్ రెడ్డి, శివుడు, స్నేహ రాంరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహరెడ్డిలపై ఐపీసీ 420 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం 2015లోని 3(1)జీ సెక్షన్ కింద కేసు నమోదు చేసారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 33, 34, 35లలోని 47 ఎకరాల 18 గుంటల భూమి రాజీ అనే మహిళా పేరిట ఉంది. ఆమెకు బిక్షపతి సహా ఏడుగురు వారసులు ఉన్నారు. తమకు వారసత్వంగా చెందాల్సిన భూమి తిరిగి తమ ఆధీనంలోకి వచ్చేలా చేస్తామని నిందితులు మభ్యపెట్టారని.. తమకు తెలియకుండా సమక్షంలో పీటీ సరెండర్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.