తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టింది. ఇక ఇప్పుడు ప్రసిద్ధి దేవాలయాలైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కొండగట్టు అంజన్న కోవెల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయానికి రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల భక్తులూ అధికసంఖ్యలో వస్తుంటారు. ఆలయ అభివృద్ధికి రూ.వంద కోట్లు విడుదల చేస్తామని గత డిసెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు.
ఇచ్చిన మాట మేరకు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు విడుదల చేసినందున ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ భారీ సాయంతో దేశంలోని గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టు రూపు దిద్దుకుంటుందన్నారు.