హైదరాబాద్‌లో ఇక నుంచి ఔటర్ రింగ్ రోడ్డు పై రయ్ రయ్ మంటూ దూకుడుగా వెళ్లొచ్చు. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగ పరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐటీ, పరిశ్రమలు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఉత్తర్వులు జారీ చేసింది.
భాగ్యనగరం చుట్టూ 158 కిలోమీటర్ల పొడవునా 8 లైన్లతో దీనిని తీర్చిదిద్దారు. ఈ రహదారిపై గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా డిజైన్‌చేశారు. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు లేకపోవడం.. తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో గరిష్ఠ వేగ పరిమితిని 100 కి.మీ.కు పరిమితం చేశారు. తాజా ఉత్తర్వులతో ఇకపై గరిష్ఠ వేగం గంటకు 120 కిలోమీటర్లకు పెరగనుంది. రహదారిపై మొదటి రెండు లైన్లలో ఈ వేగానికి అనుమతినిచ్చారు. వాహనాల సంఖ్య పెరగడంతో వేగ పరిమితి 100 కి.మీ. ఉంచడం వల్ల ఔటర్‌ను దాటడంలో ఆలస్యమవుతోంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.