ప్రగతి భవన్ ముట్టడికి జీహెచ్ఎంసీ కార్మికులు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు భారీ ర్యాలీకి కార్మికులు ప్లాన్ చేశారు. దీనికి ప్రధాన కారణం జిహెచ్ఎంసి లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని.. జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం నుంచి ప్రగతి భవన్ వరకు కార్మికులు ర్యాలీ చేయనున్నారు. ప్రగతి భవన్ ముందు చెత్త వేసి నిరసన తెలుపుతామని కార్మికులు చెబుతున్నారు.
దీంతో జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మూడు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని, తమకు జీతం పెంచాలని.. దాన్ని సకాలంలో ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న స్పందన కరువైందని అన్నారు. దీంతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకొని కుటుంబాన్ని నెట్టుకు రాలేక అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో జీతాల కోసం నగరంలోని జీహెచ్ఎంసీ కార్మికులు ఆందోళనలు చేపడుతున్నారు.