తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి ఇచ్చి హామీని నెరవేరుస్తూ.. జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మినీ అంగన్ వాడీ టీచర్లను అంగన్వాడీ టీచర్ గా ప్రమోట్ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లు ఇకపై అంగన్వాడి టీచర్లుగా భాద్యతలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో ఇకపై మినీ, మెయిన్ అంగన్వాడి అనే తేడా ఉండదు.
గతంలో మినీ అంగన్వాడీలకు రూ. 7800 జీతం మాత్రమే ఇస్తుండగా.. తాజా నిర్ణయంతో వారికి రూ. 13,650 జీతం అందనుంది. పెంచిన ఈ జీతం ఏప్రిల్ నెల నుంచి అంగవాడీలకు అందించనున్నారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇన్ని రోజులు వేచి చూసిన 3,989 అంగన్వాడీ టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమకు ప్రమోషన్ ఇవ్వడంతో పాటు జీతం పెంచినందుకు మంత్రి సీతక్క కు, ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.