తెలంగాణ వైద్య విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్య శాఖలో మరోసారి ఉద్యోగాల జాతర మొదలైంది. ఈ మేరకు శుక్రవారం 1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్ లో 1616, ఆర్టీసీ హాస్పిటల్ లో 7 పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తులకు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గడువు ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో తెలంగాణ వైద్య విధానం పరిషత్ లోని హాస్పిటల్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరగనుంది. జిల్లా, ఏరియా హాస్పిటల్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు మరింత మెరుగు అవనున్నాయి. మరోవైపు పల్లెలకు స్పెషాలిటీ వైద్య సేవలు చేరువకానున్నాయి. ఆరోగ్య శాఖలో ఇప్పటికే సుమారు 8 వేల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. మరో 7 వేల పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.