బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్టును కేంద్రమంత్రి బండి సంజయ్ ఖండించారు. చేవెళ్లలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుంటే ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భారత రాష్ట్ర సమితి బాటలోనే నడుస్తోందని మండిపడ్డారు. అరెస్టులతో వైఫల్యాలు కప్పిపుచ్చుకోవాలని ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. తక్షణమే రామచందర్ రావు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. అరెస్టు చేసిన నాయకులు, కార్యకర్తలను విడుదల చేయాలన్నారు. చేయాల్సింది అరెస్టులు కాదు. సమస్యల పరిష్కారం అని చెప్పారు. నిరంకుశ విధానాలు మానకపోతే ప్రజాక్షేత్రంలో మట్టి కరిపించడం ఖాయమన్నారు. జీహెచ్ఎంసీలో సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ నేడు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ను హైదరాబాద్ కు వస్తుండగా అరెస్టు చేశారు.