హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ట్రాఫిక్ కష్టాలు తగ్గించేలా లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టానున్నారు. అయితే ఇవాళ మంత్రి కేటీఆర్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అత్యంత వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహా నగరంలో మౌలిక వసతుల కల్పనపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతోపాటు ప్రయాణ సమయాన్ని ఆదా చేసే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా.. నగరంలో మిస్సింగ్ లింక్ కారిడార్లు, స్లిప్ రోడ్లను గుర్తించి అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.
జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాల మధ్య దూరం తగ్గించేందుకు లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధాన కారిడార్‌లపై ట్రాఫిక్ రద్దీ తగ్గించటమే లింక్ రోడ్ల ప్రధాన ఉద్దేశం. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి.., భవిష్యత్ ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా.. లింక్ రోడ్ల నిర్మాణానికి ఉపక్రమించింది. మొత్తం 126.20 కిలోమీటర్ల పొడవు కలిగిన 135 లింక్ రోడ్లను నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. నూతనంగా నిర్మితమవుతున్న లింక్ రోడ్లతో హైదరాబాద్ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరటంతో పాటు.., నగర పరిధిలోని ప్రాంతాల మధ్య దూరం తగ్గనుందని తెలిపారు.