గ్రేటర్ హైదరాబాద్ లో పవర్ కట్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇక నుంచి విద్యుత్ అంతరాయం కలుగకుండా ప్రత్యేక వాహనాలను తీసుకొచ్చింది. ఈ వాహనాలను తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ప్రారంభించారు. గతంలో అత్యవసర విద్యుత్ సేవల పునరుద్దరణకు ప్రత్యేక వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే.. వెను వెంటనే పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అంబులెన్స్ తరహాలో సీబీడీ విభాగాన్ని పటిష్టపరిచేందుకు అన్ని డివిజన్లలో ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. 24 గంటల పాటు ఈ వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే వెంటనే అత్యవసర సేవల సిబ్బంది అందుబాటులోకి వస్తారని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 57 సబ్ డివిజన్లు ఉన్నాయన్నారు. ప్రత్యేక వాహనంలో ఎర్త్ రాడ్లు, హెల్మెట్ వంటి భద్రతా పరికరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.