తెలంగాణ లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. విమర్శలు ప్రతివిమర్శలు, సవాళ్లు ప్రతి సవాళ్లతో రంజుగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్యారంటీల అమలుపై గులాబీ నేతలు సవాళ్లు విసురుతున్నారు. ఆ ఛాలెంజ్ను స్వీకరించిన సీఎం వారికి ప్రతి సవాల్ చేస్తున్నారు. ఇలా ఛాలెంజ్లతో రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది.
తాజాగా మరోసారి మాజీమంత్రి హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. హామీల అమలుపై రేవంత్ రెడ్డి అమరుల స్తూపం వద్దకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఇద్దరి రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదామని ఉద్ఘాటించారు. ఆగస్టు 15వ తేదీలోపు హామీలు అమలు చేస్తే తమ రాజీనామా లేఖ స్పీకర్‌కు ఇస్తారని, అమలు చేయకుంటే సీఎం రేవంత్‌రెడ్డి తమ రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వాలని సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు హరీశ్‌రావు అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లనున్నారు. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా లేఖతో ఆయన అక్కడికి చేరుకోనున్నారు.