రైతు భరోసా అమలు విషయంలో మరో సారి తన మాటను నిలబెట్టుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక గా పోస్ట్ చేసి ఆగ్రహం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాట తప్పడం, రైతులను మోసం చేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. జనవరి 26న రైతు భరోసా కింద ఇచ్చే డబ్బులను మార్చి 31లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారని.. హామీ ఇంకా నెరవేరలేదని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ మార్చి 31 వరకు రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని హామీ ఇచ్చారని.. ఏప్రిల్ 01వ తేదీ వచ్చేసినా ఆ నిధుల గురించి ఎలాంటి ప్రకటన రాలేదని ఆయన మండిపడ్డారు. ఉగాది పండుగను పురస్కరించుకొని రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూశారని వారికి ప్రభుత్వం చేదు అనుభవం మిగిల్చిందని విమర్శించారు హరీశ్ రావు.