దారిద్య్రరేఖ కు దిగువన ఉన్న కుటుంబాలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కొనసాగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పని దినాలు 12.22 కోట్ల నుంచి ఏకంగా 6.5 కోట్లకు తగ్గాయని కామెంట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 42 సార్లు ఢిల్లీకి వెల్లినా ఉపాధి హామీ పని దినాలు ఎందుకు తగ్గాయో చెప్పాలన్నారు.
పని రోజులను కేంద్రం తగ్గించినా.. రాష్ట్రంలో ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని ధ్వజమెత్తారు. గత నాలుగు నెలలుగా ఉపాధి హామీ కూలీల వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. అలాగే తగ్గించిన పని దినాలను కూడా పెంచాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.