ఎగువన కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతోంది. ఈ వరద ప్రవాహంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం వద్ద నది నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాద్రి వద్ద 37 అడుగులకు నీటిమట్టం చేరింది. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు జలాశయానికి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి 50 వేల క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 14 వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు ఉండగా..ప్రస్తుతం 18 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 1067.10 అడుగులకు చేరింది. మరోవైపు నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. కడెం జలాశయం ఇన్‌ఫ్లో 19,686, ఔట్ ఫ్లో 18,227 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 690.875 అడుగులకు చేరింది. స్వర్ణ జలాశయంలోకి 6,480 క్యూసెక్కుల వరద చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం1,183 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 1,176 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.