హైదరాబాద్ మహానగరంలో బుధవారం సాయంత్రం స్వల్ప వ్యవధిలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన నగర ప్రజలను వణికించింది. చాలా రోజుల తర్వాత కరుణించిన వరుణుడు విజృంభించాడు. గంట వ్యవధిలోనే నాంపల్లిలో 8.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైటెక్ సిటీ పరిసరాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.
భూగర్భ పైపులైన్లలోని వరద రోడ్లపైకి పెల్లుబికింది. అనేక ద్విచక్రవాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై మోకాలి లోతు నీరు ప్రవహించింది. రోడ్లపైకి నీరు చేరి చెరువులను తలపించాయి. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. చాలా సేపటి వరకు వాహనదారులు వానలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కురిసింది కాసేపే అయినా చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరాయి.