తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో జోరు సాగిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. బీజేపీ ఇంకా అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నా.. జాతీయ నేతలను రంగంలోకి దింపి ప్రచారం నిర్వహిస్తోంది. మరో నెలన్నరలో తెలంగాణ ప్రజల మనసు ఎవరు గెలుస్తారో తెలిసిపోతుంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ నవంబర్ 30వ తేదీన రాష్ట్రంలో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో పోలింగ్ జరగనున్న నవంబరు 30వ తేదీని వేతనంతో కూడిన సెలవు దినంగా రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంస్థలు, కార్యాలయాలకు నవంబరు 29వ తేదీన కూడా సెలవు ఇచ్చింది. డిసెంబరు 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగే ఆయా కార్యాలయాలు సెలవు ఉంటుందని, ఈ మేరకు జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..
క్రమ
సంఖ్య |
ముఖ్యమైన వివరాలు | తేదీలు |
1 | నోటిఫికేషన్ తేదీ | నవంబర్ 3 |
2 | నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ | నవంబర్ 10 |
3 | నామినేషన్ల పరిశీలన తేదీ | నవంబర్ 13 |
4 | నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ | నవంబర్ 15 |
5 | పోలింగ్ తేదీ | నవంబర్ 30 |
6 | ఓట్ల లెక్కింపు తేదీ | డిసెంబరు 3 |