గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగానికి అత్యంత కీలక బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ భౌగోళిక పరిధిని విస్తరించనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని కూడా అవుటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు ఈ విభాగం సేవలు అందించేందుకు అవసరమైన మార్పులు చేసేందుకు సిద్ధం అయ్యారు.
ఇకపై ఈ విభాగాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అని పేరు అని వెల్లడించారు. హైడ్రాకు డీఐజీ స్థాయి అధికారి ఈ విభాగానికి డైరెక్టర్గా, ఎస్పీ స్థాయి అధికారులు అడిషనల్ డైరైక్టర్లు ఉంటారని తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, సిటీ ట్రాఫిక్, వివిధ విభాగాల నుంచి ప్రత్యేక టీమ్లు ఉంటాయని… కేవలం వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా ఇకపై విపత్తుల నిర్వహణ విభాగం సిటీ ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్.